పూటగడవక…వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన 12వేల మందికి కొత్త జీవితాన్నిచ్చిన సునిత.
జగదీష్ గాంధీ, ప్రకాష్ ఆమ్టే, చార్లెస్ కొరియా, ముత్తు, అజిత్ దోవల్, రవీంద్ర కౌశిక్, టెస్సీ థామస్, సుబోధ్ కుమార్ సింగ్, నాగ నరేష్ వంటి పలువురు రియల్ స్టార్లు, హీరోల గురించి ఇప్పటి వరకు వరుస కథనాల్లో తెలుసుకున్నాం కదా. ఇక చివరిగా అలాంటి మరో రియల్ స్టార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమే డాక్టర్ సునీతా కృష్ణన్. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారిని రక్షించడమే కాదు, వారికి ఆపన్న హస్తం అందించి, వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తోంది ఈమె. తాను చేసిన సేవలకు గాను లెక్కలేనన్ని అవార్డులు కూడా ఈమెను వరించాయి.
1972లో బెంగుళూరులో మళయాళీ కుటుంబంలో సునీతా కృష్ణన్ జన్మించింది. తండ్రి సర్వేయర్ కావడంతో సహజంగానే ఆమె ఆయనతో దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే సునీతకు సామాజిక సేవపై ఆసక్తి కలిగింది. 8 ఏళ్ల వయస్సులో మానసిక వికలాంగ చిన్నారులకు డ్యాన్స్ పాఠాలు చెప్పింది. 12 ఏళ్ల వయస్సులో వీధి బాలలకు చదువు చెప్పేది. 15వ ఏట ఓ సామాజిక సేవా కార్యక్రమానికి వెళ్లిన ఆమెను దుండగులు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఆమె ఒకటే నిశ్చయించుకుంది. అదే వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని రక్షించి, వారికి ఆపన్న హస్తం అందించాలని. వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె ప్రజ్వల పేరిట 1996లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. అయితే కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందకపోవడంతో ఆమే స్వయంగా దాన్ని నడపాలని అనుకుంది. తన వద్ద ఉన్న ఆభరణాలు, ఇతర వస్తువులను అమ్మి ప్రజ్వలను ప్రారంభించింది. దాని ద్వారా చాలా మంది మహిళలకు చేయూతనిస్తోంది.
వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారు, బలవంతంగా అందులోకి నెట్టబడుతున్న వారిని రక్షించి తన స్వచ్ఛంద సంస్థలో వారికి ఆశ్రయం ఇచ్చేది. అలా ఇప్పటి వరకు ఆమె దాదాపుగా 12వేల మందిని కాపాడగలిగింది. అంతేకాదు, తన సంస్థలోనే వారికి వడ్రంగి పని, ప్రింటింగ్, హౌజ్ కీపింగ్ వంటి అంశాల్లో శిక్షణనిస్తూ వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తోంది. ఇదొక్కటే కాదు ఆమె చేసిన సేవలు ఇంకా చాలానే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడు దానిపై పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు తీసుకురావడంలో, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఏపీ, యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి జరుగతున్న మహిళలు, యువతుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం అందించడంలో, దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పలు క్యాంపెయిన్లు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో ఈమె ఎల్లప్పుడూ ముందుండే వారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను నివారించేలా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తేవాలని కూడా ఆమె పోరాడారు. దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన శాఖల్లోనూ ఈమె పని చేశారు.
దర్శకుడు రాజేష్‌ను వివాహమాడిన ఈమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పలు సినిమాలను కూడా నిర్మించారు. అనామిక, నా బంగారు తల్లి వంటివి వారు తీసిన సినిమాలే. వాటికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా లభించాయి. కాగా సునీతా కృష్ణన్ చేసిన సేవలకు గాను ఆమెకు లెక్కలేనన్ని అవార్డులు లభించాయి. వాటిలో 2016లో వచ్చిన పద్మశ్రీ అత్యంత ముఖ్యమైంది. అదే కాక మదర్ థెరిస్సా అవార్డు, పీపుల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ నేషనల్ అవార్డు, మహిళా తిలకం అవార్డు, ఔట్‌స్టాండింగ్ వుమన్ అవార్డు, ఆకృతి వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, వుమెన్ ఇన్ ఎక్సలెన్స్ అవార్డు, జీ8 వుమన్ అవార్డు, హ్యూమన్ రైట్స్ అవార్డు, సీఎన్ఎన్ ఐబీఎన్ రియల్ హీరో అవార్డు వంటి ఎన్నో పేరెన్నికగన్న అవార్డులు ఆమెను వరించాయి. అవును మరి, నిజంగా ఆమె రియల్ స్టారే కదా..!
No comments:
Post a Comment